వరలక్ష్మీ వ్రతం

మహిళలకు మంగళప్రదమైందీ, శుభదాయకమైందీ ఈ వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ముత్తయిదువులందరూ ఈ నోమును భక్తిశ్రద్ధలతో నోచుకుంటారు. వరలక్ష్మీదేవి, స్త్రీలకు సకలసంపదలూ ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు.

శ్రావణమాసంలోని శుభశుక్రవారం నాటి వరలక్ష్మివ్రతం తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతి ప్రతిబింబించే పర్వదినం. భాగ్యదాయిని, సౌభాగ్యదాయిని అయిన వరలక్ష్మిదేవిని మనం వరాలు కోరుకోవాలంటే ముందుగా ఆ దేవిని ప్రసన్నం చేసుకోవాలి. అందుకే ఈ వ్రతం చేస్తారు.

వరలక్ష్మి వ్రతంరోజున మహిళలు తెల్లవారే నిద్రలేచి ఇళ్ళు , వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. గుమ్మాలకు మంగళతోరణాలతో అలంకరించాలి. గడపలకు పసుపురాసి కుంకుమబొట్లు పెట్టాలి. ఇంట్లో తూర్పుదిక్కున మండపం ఏర్పరుచుకోవాలి.ఆ మండపాన్ని అరటిపిలకలు, పువ్వులు , మామిడి తోరణాలతో అలంకరించాలి.మండపానికి పసుపు, కుంకుమలు పెట్టుకోవాలి.

మండపంలో వెనుకవైపుగా లక్ష్మీదేవి చిత్రపటాన్నిగానీ, విగ్రహాన్నీగానీ వుంచాలి. బంగారు, వెండి లేదా ఇతర లోహపు చెంబును శుభ్రంగా తోమి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. దీనిపై కలశం ఏర్పరుచుకోవాలి. కొబ్బరికాయకు పసుపురాసి, కుంకుమ బొట్లు పెట్టి, కొత్త రవిక గుడ్డ కప్పి కలశం ఏర్పరుచుకోవచ్చు.లేదా బంగారు లేక వెండి ముఖాన్నికూడా కలశంపై పెట్టుకోవచ్చు.

మల్లెలు, మొల్లలు, సంపెంగలు , మొగలి పువ్వులతో కలశాన్ని,మండపాన్ని అలంకరించాలి. పలురకాల పువ్వులు,పండ్లు, పసుపు కుంకుమలు-అక్షింతలు సిద్ధం చేసుకోవాలి.

వరలక్ష్మి వ్రతంనాడు తొమ్మిది రకాల పిండివంటలు చేసి,ఆ దేవికి నైవెద్యం పెట్టాలని పెద్దలు చెపుతారు. తొమ్మిది రకాలు చేయలేని వారు, తమకు చేతనైనన్ని చేసుకోవచ్చు.

కలశం ఏర్పరచిన తరువాత వరలక్ష్మి దేవిని ఆవాహన చేయాలి.

శ్లో!! పద్మాసనే పద్మకరే – సర్వలోకైక పూజితే
నారాయణప్రేమేదేవీ – సుప్రీతాభవసర్వదా

అంటూ వరలక్ష్మిదేవిని ప్రార్ధించాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ ఆవాహయామి
ఓం శ్రీ వరలక్ష్మీ రత్నసింహాసనం సమర్పయామి
ఓం శ్రీ వరలక్ష్మీ అర్జ్యం సమర్పయామి
ఓం శ్రీ వరలక్ష్మీ పాద్యం సమర్పయామి
ఓం శ్రీ వరలక్ష్మీ ఆచమనీయం సమర్పయామి
ఓం శ్రీ వరలక్ష్మీ పంచామృతస్నానం సమర్పయామి
ఓం శ్రీ వరలక్ష్మీ శుద్ధోదకస్నానం సమర్పయామి
ఓం శ్రీ వరలక్ష్మీ వస్త్రయుగ్నం సమర్పయామి
ఓం శ్రీ వరలక్ష్మీ ఆభరణానే సమర్పయామి
ఓం శ్రీ వరలక్ష్మీ మాంగల్యం సమర్పయామి
ఓం శ్రీ వరలక్ష్మీ గంధం సమర్పయామి
ఓం శ్రీ వరలక్ష్మీ అక్షాతన్ సమర్పయామి
ఓం శ్రీ వరలక్ష్మీ పుష్పాణి సమర్పయామి

అంటూ వరుసగా చదువుకోవాలి. ఆయా ద్రవ్యాల పేరులు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి.

రత్నసింహాసనాలు, బంగారు మాంగల్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు. ఆ తరువాత వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి.

ఆ తరువాత ఈ విధంగా చేయాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ ధూపం ఆఘ్రాపయామి – అగరువత్తులు వెలిగించి చూపించాలి.
ఓం శ్రీ వరలక్ష్మీ దీపం దర్శయామి. కుందులలో నూనెపోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి.
ఓం శ్రీ వరలక్ష్మీ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి.
ఓం శ్రీ వరలక్ష్మీ తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్కలతో తాంబూలం సమర్పించాలి.
ఓం శ్రీ వరలక్ష్మీ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.
ఓం శ్రీ వరలక్ష్మీ మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి.
ఓం శ్రీ వరలక్ష్మీ ప్రదక్షిణ నమస్కాన్ సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి.
ఓం శ్రీ వరలక్ష్మీ నమస్కారన్ సమర్పయామి. నమస్కరించాలి.

ఈ విధంగా పూజించిన తరువాత చెప్పుకోవాలి.

సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి స్త్రీలకు తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుడిని కోరినప్పుడు, ఆ ముక్కంటి వరలక్ష్మీ వ్రతాన్ని గురించి చెప్పినట్లు శాస్త్రాలు వెల్లడించాయి. స్త్రీల ఆధ్యాత్మిక జీవన విధానంలో ఒక భాగమైపోయిన ‘నోములు – వ్రతాలు’లో ముందుగా ‘శ్రీ వరలక్ష్మీ వ్రతం’ గురించి తెలుసుకుందాం.

సంపద వుంటే సగం సమస్యలు దూరమైనట్టే. అలాంటి సంపద లభించాలంటే సకల సంపదలకు పుట్టినిల్లు అయిన ‘శ్రీ వరలక్ష్మీ దేవి’ అనుగ్రహం ఉండాలి. అందుకోసం ‘శ్రీ వరలక్ష్మీ వ్రతం’ ఆచరించాలి.

ఈ వ్రతాన్ని ఆచరించే వారు … ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి పీఠంపై అమ్మవారి ప్రతిమను … కలశాన్ని పసుపుతో అమ్మవారిని సిద్ధం చేసుకున్నాక ఆచమనం చేయాలి. దీపారాధన చేసి దీపానికి నమస్కరించాలి. గణపతి ప్రార్ధన … ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకోవాలి. కలశారాధన చేసి … అమ్మవారిని ధ్యానించి ఆవాహన చేయాలి.

అమ్మవారికి సింహాసనాన్ని సమర్పించి అర్ఘ్య పాద్యాలను ఇవ్వాలి. ఆ తరువాత పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించి .. శుద్ధోదక స్నానం చేయించి వస్త్రాభరణాలు .. పసుపు కుంకుమలు .. పూలు .. గంధం .. అక్షితలు సమర్పించాలి. ఆ తరువాత వరలక్ష్మీ అష్టోత్తరం చదువుకుని, ధూప .. దీప .. నైవేద్యాలను సమర్పించాలి. ఈ వ్రతం ఆచరించడానికి అవసరమైన ఈ కథను చెప్పుకోవాలి.

పూర్వం మగధదేశంలోని ఓ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ‘చారుమతి’అనే ఇల్లాలు వుండేది. ఆమె వరలక్ష్మీ దేవి భక్తురాలు. భర్త మనసెరిగి నడచుకోవడమే కాకుండా, అత్తమామలను తల్లిదండ్రులవలే ఆదరిస్తూ వుండేది.

నిరంతరం ఇంటి పనుల్లో నిమగ్నమవుతూనే, వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తూ ఉండేది. చారుమతి వినయ విధేయతలు … భక్తి ప్రపత్తులకు మెచ్చిన వరలక్ష్మీ దేవి కలలో కనిపించి ఆమెపట్ల తనకి గల అనుగ్రహాన్ని తెలియజేసింది. ‘శ్రావణ పౌర్ణమి’కి ముందు వచ్చు ‘శుక్రవారం’ తన వ్రతమును ఆచరించించడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పింది.

మరునాటి ఉదయం తనకి వచ్చిన కల గురించి చారుమతి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వాళ్లంతా కూడా అమ్మవారు చెప్పినట్టుగా చేయమని ఆమెను ప్రోత్సాహించారు. దాంతో చారుమతి తమ ఇంటి చుట్టుపక్కల వారికి ఈ విషయం చెప్పింది. ఆ రోజున అందరూ రావాలని ఆహ్వానించింది. ‘శ్రావణ శుక్రవారం’రోజున అంతా చారుమతి ఇంటికి చేరుకున్నారు.

అప్పటికే ఆమె అమ్మవారి కోసం పీఠాన్ని సిద్ధం చేసి దానిపై కలశాన్ని ఉంచింది. ఆ తరువాత షోడశోపచారాలతో అమ్మవారిని పూజించి … తొమ్మిది పోగుల తోరమును ధరించి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించింది. దాంతో ఆమెతో పాటు మిగతా వారు కూడా ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టారు.

అలా వాళ్లు ఒక్కో ప్రదక్షిణ చేస్తుండగా వాళ్ల ఇళ్లలో సిరిసంపదలు పెరిగిపోసాగాయి. మూడు ప్రదక్షిణలు పూర్తి కాగానే వాళ్లందరి ఇళ్లు ధన కనక వస్తువులతో నిండిపోయాయి. అమ్మవారి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసిన వీళ్లంతా, ప్రతి ఏడాది చారుమతి చేసిన తరహాలోనే వరలక్ష్మీ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు.

ఈ వ్రతం పూర్తి అయిన తరువాత మూడు సార్లు తీర్థం తీసుకుని మిగతావారికి ఇవ్వాలి. శక్తి మేరకు పేరంటాళ్లకు వాయనాలు ఇచ్చి పంపాలి. ఆ తరువాత ఉద్యాపన చేసుకోవాలి. ఈ వ్రతం చేసినా .. చూసినా .. కనీసం విన్నా .. సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

వరలక్ష్మి వ్రతకథ

పూర్వం మగధ దేశంలోని కుండినం అనే పట్టణంలో చారుమతి అనే మహాసాధ్వి అయిన బ్రాహ్మణ స్త్రీ వుండేది. ఆమె సత్ప్రవర్తన కలిగి, వినయ విధేయతలతో భర్తను, అత్తమామలను సేవిస్తూ జీవిస్తూండేది. ఆమె వినయ విధేయతలకు మెచ్చిమహాలక్ష్మిదేవి ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి, వరలక్ష్మివ్రతం ఉపదేశించి, శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం ఆచరిస్తే సకల సౌభాగ్యాలు చెకూరుతాయని చెపుతుంది. ఆ ప్రకారం చారుమతి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మివ్రతం ఆచరించి సకల శుభాలు , సౌభాగ్యాలు పొందుతుంది .

ఈ విధంగా వరలక్ష్మివ్రతం కథ చెప్పుకుంటూ తొమ్మిది దారల నూలు దారాలను పువ్వులతో తొమ్మిది ముడులు వేస్తూ ‘ తారం ‘ తయారుచేసుకొని , కుంకుమబొట్టు పెట్టుకుని, చేతిలో కొబ్బరిచిప్ప కట్టుకుని ముత్తయిదువ చేత తారం కట్టించుకోవాలి. ఆ తరువాత దేవికి హారతి ఇచ్చి, పిండి వంటలను బ్రాహ్మణనీకు దానం ఇచ్చి ఉద్యాపనం చేయాలి.

సాయంత్రం ఇరుగు పొరుగు ముత్తయిదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి, నుదుట కుంకుమ పెట్టి, నానబోసిన సెనగలతో బాటు తాంబూలం ఇచ్చి అక్షింతలు ఇచ్చి నమస్కరించి ఆశీర్వాదం పొందాలి. వచ్చిన పేరంటాలు…అమ్మవారి మీద పాటలు పాడి హారతులు ఇచ్చి అక్షింతలు వేసి పూజించాలి. ఈ విధంగా చేసినవారికి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.

శ్లో!! కళ్యాణి కమల నిలమే కామతార ప్రదాయిని
మానవత్వం పూజయిష్యామి శుభదే సుస్థిరాభవ !!

కమల నిలయ, కోరిన కోర్కెలు తీర్చే ఆ తల్లిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి.

శ్రావణమాసం నోముల్లో అనేక అర్ధాలు, పరమార్ధాలు వున్నాయి. పసుపు కుంకుమలు శుభప్రదాలేగాక ఆరోగ్యదాయకాలు కూడా. పసువు పవిత్రతకూ , శుభానికి చిహ్నం. పసువు అందాన్నీ, ఆరోగ్యాన్నీ పెంపొందింపజేస్తుంది . పసుపులో క్రిమిసంహారక లక్షణాలు, ఔషద గుణాలు పుష్కలంగావున్నాయి.

శ్రావణమాసంలో వర్షాలు ఎక్కువగా వుంటాయి. వర్షపు నీటిలో తిరుగుతూ పనులు చేసుకోవడం వల్ల, స్త్రీల పాదాలకు ఫంగల్ ఇన్ ఫెక్షన్ సోకే అవకాశం వుంది. కాబట్టి పాదాలకు పసుపురాసుకుంటే ఫంగస్ ను నిర్మూలిస్తుంది. ముఖానికి పసువు రాసుకోవడం వల్ల ముఖానికి ఛాయ పెరుగుతుంది. మొటిమలు, పొక్కులు పోతాయి.

శ్రావణమాసంలో నోములు నోచుకునే వారు, నానబోసిన సెనగలను…ఇరుగు పొరుగువారికి, పిల్లలకు, పేరంటాలకు పంచుతారు. మొలకెత్తే సెనగల్లో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. వీటిలో ” విటమిన్ – ఎ “, “ విటమిన్ -బి కాంప్లేక్స్”, “ విటమిన్ – సి “, “ విటమిన్ – ఇ ” వుంటాయి. ఈ విధంగా శ్రావణమాసం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది.

Advertisements