బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి విధులని ఆచరించాలి?

బ్రాహ్మణుడైన వాడు నిత్య ఆచార వంతుడై, అనుష్ఠాన పరుడై, స్వాధ్యాయమును సాగించుచూ క్రొత్త విషయములను వేదములనుండి గ్రహించుచూ, తనకు తెలిసిన వాటిని తెలియని వారికి తెలుపుచూ ఉండవలెను. తాను ఎంత శ్రమకు ఓర్చి అయినను నిత్యానుష్ఠాన,దేవతార్చనాదులను ఆచరించ వలెను. ఆవిధముగా ఆచరించినపుడు మాత్రమే అతడు “భూసురుడు” అన్న మాటకు తగిన వాడు అవుతాడు. అటులకాని వాడు భూలోకమున దేవతల రూపముధరించిన కలిపురుషుడే కానీ మరొకడు కాదు.

ఇక బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి చేయాలి అన్నది చాలామందికి సందేహము. అది కొంత తీర్చే ప్రయత్నము చేద్దాము.

ప్రొద్దున్నే నిద్రనుండి ౪ గం.లకు లేవాలి. ప్రాతస్మరణము,శుభవస్తు దర్శనము చేసి, కాలకృత్యములు తీర్చుకుని, నదికి గానీ తటాకమునకు గానీ వెళ్లిస్నానమాచరించవలెను.

౧. స్నానము
౨.సంధ్యోపాసనము
౩.జపాదికము
౪.ఔపాసనము
౫. పంచాయతన దేవతార్చనము
౬.బ్రహ్మయఙ్ఞము
౭. వైశ్వదేవము
౮. పంచాయతనమునకు పునః పూజ
౯. అతిథిపూజ( భోజనము)
౧౦.భోజనము
౧౧.సత్సంగము
౧౨. సాయం సంధ్యావందనము
౧౩. సాయమౌపాసనము
౧౪. రాత్రి వైశ్వదేవము
౧౫. రాత్రి దేవతార్చనము

ఇవిగాక స్వాధ్యాయము, అధ్యాపనము, యజనము-యాజనము, దానము-ప్రతిగ్రహణము,నైమిత్తికములు,శాంతులు, నిత్య లౌకిక కృత్యములు మొదలైనవి నిత్యము చేయాలి

ప్రస్తుత కాలంలో మంచి లక్షణాలు కలిగిన బ్రాహ్మణులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు.
బ్రాహ్మణులకి ఉండవలసిన, ఉండకూడని లక్షణాలు ఏమిటి ?.

దైవాధీనం జగత్ సర్వం | మంత్రాధీనంతు దైవతం ||
తన్మంత్రం బ్రాహ్మణాధీనం | బ్రాహ్మణో మమ దేవత ||

ఈ జగత్తు మొత్తము దైవము యొక్క అధీనంలో వుంటుంది.
ఆ దేవతలు మంత్రముల ద్వారా సంతృప్తి చెంది, ఆ మంత్రములకు అధీనులై వుంటారు.
ఆ మంత్రము సాత్విక లక్షణములు కలిగిన బ్రాహ్మణుల అధీనంలో వుంటుంది.
అటువంటి బ్రాహ్మణులు దేవతా స్వరూపములు అని తెలుసుకోవాలి.

పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం చేత, మనుష్యులలో బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. కానీ, లభించిన ఆ జన్మలో చెడు మార్గాల వైపు ప్రయాణం చేస్తూ వుంటే మాత్రం, అందుకు తగిన పరిహారం ఖచ్చితంగా చేల్లించుకోవాలి. వచ్చే జన్మ సంగతి ఎలా వున్నా, ఈ జన్మలోనే ముందు ఆ దోషముల ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఉద్యోగాలు చేసుకునే బ్రాహ్మణుల విషయం ఎలా వున్నా, కనీసం వైదికంలో వుండే బ్రాహ్మణులు (హిందూ ప్రీస్ట్) మాత్రం కొన్ని కనీస నియమాలు పాటించాలి. అవి పాటించటం కష్టం అనుకుంటే, వైదికవృత్తి వదిలేసి వేరే వృత్తి చూసుకోవటం మంచిది.

బ్రాహ్మణుడికి ఉండవలసిన కనీస లక్షణాలు :

యజ్ఞోపవీత (జంధ్యం) ధారణ :
కేవలం యజ్ఞోపవీతం ధారణ చేయటమే కాకుండా, దానికి సంబంధించిన నియమాలు పాటించాలి.

నిత్య సంధ్యావందనం :
నిత్యం ఖచ్చితంగా సంధ్యావందనము, గాయత్రీ జపము చేస్తూ వుండాలి.

శిఖా సంస్కారం (పిలక), చెవి పోగులు :
బ్రాహ్మణులకి శిఖా సంస్కారం (పిలక) మరియు చేవిపోగులు ఖచ్చితంగా వుండాలి. ఎవరైనా బ్రాహ్మణులు శిఖ లేకుండా బ్రాహ్మణ వృత్తి చేస్తూ వుంటే, అతనికి తన వృత్తి పట్ల, దేవతల పట్ల నమ్మకం లేదు అని తెలుసుకోవాలి. అంతే కాకుండా, అతను సమాజాన్నీ, భక్తులనీ మోసం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. అతనిని గౌరవించవలసిన అవసరం లేదు. సంస్కారాలకి విలువ ఇవ్వనివాడు ఎంత చదువుకున్నా ప్రయోజనం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే శిఖ లేనివాడు బ్రాహ్మణుడే కాదు.

పవిత్రద్రవ్య ధారణ :
ముఖము నందు బ్రహ్మ తేజస్సు కనిపించాలి. ఎల్లవేళలా, నుదిటిన కుంకుమ లేక విభూది లేక గంధము ధరించినవాడై వుండాలి. వారిని చూస్తే గురు భావన కలగాలి.

ప్రశాంతంగా ఉండుట :
ఎప్పుడూ ప్రశాంతంగా వుండాలి తప్ప, కోపము, చికాకు, విసుకు, అయిష్టము, ద్వేషము వంటి గుణములు వుండకూడదు. నిగ్రహం లేనివ్యక్తి దేవతా అర్చానాదులకి అర్హుడు కాడు.

స్పష్టంగా మాట్లాడుట :
మాట్లాడే మాట స్పష్టంగా వుండాలి. మనస్సులో ఒకటి, బయటికి చెప్పేది వేరొకటి వుండకూడదు. సత్యమే మాట్లాడాలి. మాటలో వెకిలితనం, గర్వం, ఇతరులని నిందించటం వంటివి వుండకూడదు. అట్లాగే, ఇతరులకి చెడు కలిగే మాటలు మాట్లాడకూడదు.

చెడు వ్యసనములు లేకుండుట :
మాంసం, మద్యం, పొగ త్రాగటం, మత్తు పదార్థాలు నములుతూ వుండటం పనికిరాదు. పర స్త్రీ, పర ధనం గురించి వ్యామోహం వుండకూడదు.

సమ భావన :
ధనిక, బీద అనే తేడా లేకుండా అందరితో సమ భావన కలిగి వుండాలి.

కేవలం, పైన చెప్పిన లక్షణాలే కాకుండా ఇంకా అనేక అంశాలు వుంటాయి. కనీసం, పైన చెప్పిన లక్షణాలు వుంటే అతను మంచి బ్రాహ్మణుడు అని చెప్పవచ్చు. వైదికాన్ని (అర్చకత్వ, పురోహిత లేక ఆగమం) ఒక డబ్బు సంపాదించే వృత్తిగా మాత్రమే భావిస్తూ, డబ్బుతో బాటు చెడు వ్యసనాలు కూడా కలిగినవారిని గౌరవించాల్సిన అవసరం లేదు.

కానీ, నిస్వార్థంగా లోకశ్రేయస్సు కోసం దేవతా అర్చన, ఆరాధనలు చేస్తున్న బ్రాహ్మణులకు ఏ కష్టం రాకుండా కాపాడుకునే బాధ్యత సమాజంలో ప్రతి వ్యక్తి పైనా వుంది. బ్రాహ్మణులు, గోవులు సుభిక్షంగా వున్నంత కాలం లోకం సుభిక్షంగా వున్నట్లే అని గ్రహించాలి.

Advertisements