భగవద్గీత:—ద్వితీయో‌உధ్యాయః

1 వ శ్లోకం:–

సంజయ ఉవాచ |
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ||

భావం:–

సంజయుడు పలికెను— ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను. అని అతని వ్యాకులపాటును, శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణభగవానుడు ఇట్లనెను.

2 వ శ్లోకం:–

కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున ||

భావం:–

శ్రీభగవానుడుఇట్లనెను ఓ అర్జునా ! తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది ?ఇది శ్రేష్టులచే ఆచరింపబడునదియు కాదు, స్వర్గమును ఇచ్చునదియు కాదు. కీర్తిని కలిగించునదియు కాదు.

3 వ శ్లోకం:–

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ||

భావం:–

కావున, ఓ అర్జునా ! పిరికితనమునకు లోనుకావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతపా ! తుచ్ఛమైన ఈ హృదయదౌర్భల్యమును వీడి, యుద్ధమునకై నడుము బిగింపుము.

.4 వ శ్లోకం:–

అర్జున ఉవాచ |

కథం భీష్మమహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ||

భావం:–
అర్జునుడు పలికెను– ఓ మధుసూదనా ! పూజ్యులైన భీష్మపితామహుని, ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను ? ఏలనన, ఓ అరిసూదనా ! ఈ ఇరువురును నాకు పూజ్యులు.

5 వ శ్లోకం:–

గురూనహత్వా హి మహానుభావాన్శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్‌உరుధిరప్రదిగ్ధాన్ ||

భావం:–
మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకుని యైనను, ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలనన, ఈ గురుజనులను చంపినను, రక్తసిక్తములైన రాజ్యసంపదలను, భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి యుండునుగదా !

6 వ శ్లోకం:–

న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః |
యానేవ హత్వా న జిజీవిషామస్తే‌உవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ||

భావం:–
ఈ యుద్ధముచేయుట శ్రేష్ఠమా ? లేక చేయ కుండుట శ్రేష్ఠమా ? అనునది ఎరుగను. యుద్ధమున వారిని మనము జయింతుమా ? లేక మనలను వారు జయింతురా ? అను విషయమునుగూడ ఎరుగను. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచట మనలను ఎదిరించి(పోరాడుటకు) నిలిచియున్నారు. వారిని చంపి, జీవించుటకును మనము ఇష్టపడము.

7 వ శ్లోకం:–

కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసంమూఢచేతాః |
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే‌உహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ||

భావం:–
కార్పణ్యదోషము(పిరికితనము)నకు లోనై, నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మములు విచక్షణకు దూరమై, నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము.

.8 వ శ్లోకం:-

న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్ |
అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ||

భావం:–
ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరిసంపదలతో గుడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారు ఉపాయమును గాంచలేకున్నాను.

9వ శ్లోకం:–

సంజయ ఉవాచ |
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప |
న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ హ ||

భావం:–
సంజయుడు పలికెను—ఓ రాజా ! ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామియైన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు, “నేను యుద్ధము చేయనే చేయను” అని స్పష్టంగా తెలిపి మౌనం వహించెను.

10 వ శ్లోకం:–

తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత |
సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః ||

భావం:–
ఓ ధృతరాష్ట్రా ! ఉభయసేనల మధ్య సంతుప్తుడైన అర్జునుని జూచి, శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను.

11 వ శ్లోకం:–

శ్రీభగవానువాచ |
అశోచ్యానన్వశోచస్త్వం ప్రఙ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||

భావం:–
శ్రీకృష్ణభగవానుడు పలికెను— ఓ అర్జునా ! సోకిమ్పదగని వారికొరకై నీవు సోకించుచున్నావు. పైగా పండితుని(జ్ఞాని) వలె మాట్లడుచున్నావు. పండితులైనవారు ప్రాణములు పోయిన వారిని గూర్చిగాని, ప్రాణములు పోనివారిని గురించిగాని శోకింపరు.

12 వ శ్లోకం:–

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ||

భావం:–
నీవుగాని, నేను గాని, ఈ రాజులుగాని ఉండని కాలమే లేదు. (అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము. అది అన్ని కాలముల యందును ఉండును. శరీరపతనముతో అది నశించునది కాదు.)

13 వ శ్లోకం:–

దేహినో‌உస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా |
తథా దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి ||

భావం:–
జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరియొక దేహప్రాప్తి కలుగును. ధీరుడైనవాడు ఈ విషయమున మోహితుడు కాడు.

14 వ శ్లోకం:-

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |
ఆగమాపాయినో‌உనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత ||

భావం:–
ఓ కౌంతేయా ! విశయెన్ద్రియ సంయోగము వలన శీతోష్ణములు, సుఖదుఃఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాసశీలములు. కనుక భారతా ! వాటిని సహింపుము. (పట్టించుకొనకుము).

15 వ శ్లోకం:–

యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ |
సమదుఃఖసుఖం ధీరం సో‌உమృతత్వాయ కల్పతే ||

భావం:–
ఏలనన, ఓ పురుషశ్రేష్ఠ ! ధీరుడైనవాడు సుఖదుఃఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేందరియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు.

16 వ శ్లోకం:–

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |
ఉభయోరపి దృష్టో‌உంతస్త్వనయోస్తత్త్వదర్శిభిః ||

భావం:–
అసత్తు అనుదానికి( అనిత్యమైనదానికి) ఉనికియే లేదు. సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధంగా ఈ రెండింటి యొక్క వాస్తవరూపములను తత్వజ్ఞానియైన వాడే ఎరుంగును.

17 వ శ్లోకం–

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి ||

భావం:–
నాశరహితమైన ఆ సత్యము(పరమాత్మ తత్వము) జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని తెలుసుకొనుము. శాశ్వతమైన దానిని ఎవ్వరు నసింపజేయజాలరు.

18 వ శ్లోకం:–

అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః |
అనాశినో‌உప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ||

భావం:–
ఈ శరీరములు అన్నియును నసించునవియే. కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము(అనిర్వచనీయము), నిత్యము, కనుక( ఈ విషయము తెలుసుకొని) ఓ భరతవంశీ ! అర్జునా ! నీవు యుద్ధము చేయుము.

19 వ శ్లోకము:–

య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ |
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ||

భావం:–
ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన, వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు. ఎవ్వరిచేతను చంపబడదు.

20 వ శ్లోకం:–

న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః |
అజో నిత్యః శాశ్వతో‌உయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ||

భావం:–
ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు. గిట్టదు. పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది. (ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను ఆరును భావ వికారములు). ఇది జన్మ లేనిది. నిత్యమూ, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు.

21 వ శ్లోకం:-

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
అథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ ||

భావం:–
ఓ పార్థా ! ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జననమరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు తెలిసికొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ? ఎవరిని ఎట్లు చంపును ?

22 వ శ్లోకం:–

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో‌உపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ ||

భావం:–
మానవుడు ఏవిధంగా జీర్ణ వస్త్రములు త్యజించి, నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును.

23 వ శ్లోకం:–

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||

భావం:–
ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింప జాలదు. నీరు తడుప జాలదు. వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు.

24 వ శ్లోకం:–

అచ్ఛేద్యో‌உయమదాహ్యో‌உయమక్లేద్యో‌உశోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణురచలో‌உయం సనాతనః ||

భావం:–
ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము. సర్వవ్యాపి, చలింపనిది(అచలము), స్థాణువు (స్థిరమైనది), సనాతనము (శాశ్వతము).

25 వ శ్లోకం:–

అవ్యక్తో‌உయమచింత్యో‌உయమవికార్యో‌உయముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||

భావం:–
ఈ ఆత్మ అవ్యక్తమైనది. (ఇంద్రియగోచరము కానిది) అచింత్యము, (మనస్సునకు అందనిది) వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జునా ! నీవు దీనికై శోకింపతగదు.
26 వ శ్లోకం:-

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ||

భావం:–
ఓ అర్జునా ! ఈ ఆత్మకు జననమరణములు కలవని ఒకవేళ, నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు.

27 వ శ్లోకం:–

జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే‌உర్థే న త్వం శోచితుమర్హసి ||

భావం:–
ఏలనన, పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు.

28 వ శ్లోకం:–

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||

భావం:–
ఓ అర్జునా ! ప్రాణులన్నియును పుట్టుటకుముందు ఇంద్రియగోచరములు కావు. (అవ్యక్తములు) మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జననమరణల మధ్యకాలమందు మాత్రమే అవి ప్రకటితములు. (ఇంద్రియ గోచరములు) అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము.

29 వ శ్లోకం:–

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ||

భావం:–
ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని(ఈ ఆత్మను) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమియు ఎరుగరు.

30 వ శ్లోకం:–

దేహీ నిత్యమవధ్యో‌உయం దేహే సర్వస్య భారత |
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ||

భావం:–
ఓ అర్జునా ! ప్రతీ దేహమునందు ఉండెడి ఈ ఆత్మా వధించుటకు వీలుకానిది. కనుక, ఏ ప్రాణిని గూర్చియైనను నీవు శోకింపదగదు.

31 వ శ్లోకం:-

స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయో‌உన్యత్క్షత్రియస్య న విద్యతే ||

భావం:–
అంతేగాక, సర్వధర్మమునుబట్టియు, నీవు భయపడనవసరము లేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుధ్హమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యమునకు మరియొకటి ఏదియును లేదు.

32 వ శ్లోకం:–
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ ||

భావం:–
ఓ పార్థా ! యాదృచ్చికముగా అనగా– అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది.

33 వ శ్లోకం:–

అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ||

భావం:–
ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరిపకున్నచో, నే స్వధర్మమునుండి పారిపోయినవాడవు అగుదువు. దాని వలన కీర్తిని కోల్పోవుదవు. పైగా నేవు పాపము చేసినవాడవు అగుదవు.

34 వ శ్లోకం:–

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే‌உవ్యయామ్ |
సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే ||

భావం:–
లోకులెల్లరును బహుకాలము వరకును నీ అపకీర్తినిగూర్చి చిలువలు పలువలుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటెను బాధాకరమైనది.

35 వ శ్లోకం:–

భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ||

భావం:–
ఈ మహారథులదృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధవిముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యెదవు. అంతేగాక, నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు.

36 వ శ్లోకం:-

అవాచ్యవాదాంశ్చ బహూన్వదిష్యంతి తవాహితాః |
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ||

భావం:–
నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించును. నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటే విచారకరమైన విషయమేముండును ?

37 వ శ్లోకం:–

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ||

భావం:–
ఓ అర్జునా ! రణరంగమున మరణించినచో, నీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము.

38 వ శ్లోకం:–

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ||

భావం:–
జయాపజయములను, లాభానష్టములను, సుఖదుఃఖములను సమానముగా భావించి, యుద్ధసన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటానే అంటవు.

39 వ శ్లోకం:–

ఏషా తే‌உభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు |
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ll

భావం:–
ఓ పార్థా ! ఈ (సమత్వ) బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెల్పితిని. ఇప్పుడు దానినే కర్మయోగదృక్పథముతో వివరించెదను. వినుము. దానిని ఆకళింపుచేసుకొని, ఆచరించినచో కర్మ బంధములనుండి నీవు విముక్తుడవు అయ్యెదవు.

40 వ శ్లోకం:–

నేహాభిక్రమనాశో‌உస్తి ప్రత్యవాయో న విద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ||

భావం:–
ఈ (నిష్కామ) కర్మయోగమును ప్రారంభించినచో, దీనికి ఎన్నటికిని బీజనాసనము లేదు. దీనికి విపరీత ఫలితములే యుండును. పైగా ఈ (నిష్కామ) కర్మయోగమును ఏ కొంచెము సాధనచేసినను, అది జన్మమృత్యురూప మహాభయమునుండి కాపాడును.

.41 వ శ్లోకం:-

వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన |
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో‌உవ్యవసాయినామ్ ||

42 వ శ్లోకం:–

యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః |
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ||

43 వ శ్లోకం:–

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ |
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ||

44 వ శ్లోకం:–

భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ||

భావం:–
ఓ అర్జునా ! వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమునకలై యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యములయొక్క బాహ్యార్థములయందే ప్రీతివహింతురు. వాటి అంతరార్థముల జోలికేపోరు. స్వర్గమునకు మించినదేదియూ లేదనియు, అదియే పరమప్రాప్యమనియు, వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములయందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించును. ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులలో బడిన భొగైశ్వర్యాసక్తులైన అజ్ఞానులబుద్దులు భగవంతుడు లక్ష్యముగాగల సమాధియందు స్థిరముగా ఉండవు.

45 వ శ్లోకం:–

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ||

భావం:–
ఓ అర్జునా ! వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు, వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగములయెడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. అంతః కరణమును వశము నందుంచుకొనుము.

.46 వ శ్లోకం:-

యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే |
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ||

భావం:–
అన్నివైపులా జలములతో నిండియున్న మహా జలాశయము అందుబాటులో నున్న వానికి చిన్నచిన్న జలాశయములవలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తినొంది, పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి, వేదముల వలన అంతియే ప్రయోజనము.

47 వ శ్లోకం:–

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగో‌உస్త్వకర్మణి ||

భావం:–
కర్తవ్యకర్మము నాచరించుటయందే నీకు అధికారము గలదు. ఎన్నటికినీ దాని ఫలములయందు లేదు. కర్మఫలములకు నీవు ఆసక్తుడవు కారాదు. కర్మలను మానుట యందు నీవు ఆసక్తుడవు కావలడు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్యబుద్ధితో కర్మలనాచరింపుము.

48 వ శ్లోకం:–

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||

భావం:–
ఓ ధనుంజయా ! యొగస్థితుడవై ఆసక్తిని వీడి, సిద్ధి — అసిద్ధుల యెడ సమత్వ భావమును కలిగియుండి, కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు.

49 వ శ్లోకం:–

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ |
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ||

భావం:–
ఈ సమత్వబుద్ధియోగముకంటెను, సకామకర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది. ఓ ధనుంజయా ! నీవు సమత్వబుద్ధియోగమునే ఆశ్రయింపుము. ఏలనన, ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంతదీనులు. కృపణులు.

50 వ శ్లోకం:–

బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ||

భావం:–
సమత్వ బుద్ధియుక్తుడైనవాడు పాపపుణ్యములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వబుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచారణము నందు కౌశలము. అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము.

.51 వ శ్లోకం:-

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ||

భావం:–
ఏలనన, సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణబంధములయ్యెదరు. అంతేగాక, వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు.

52 వ శ్లోకం:–

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||

భావం:–
మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగములనుండి వైరాగ్యమును పొందగలవు.

53 వ శ్లోకం:–

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ||

భావం:–
నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన (అయోమయమునకు గురియైన) నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య (శాశ్వత) సంయోగము ఏర్పడును.

54 వ శ్లోకం:–

అర్జున ఉవాచ |

స్థితప్రఙ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ ||

భావం:–
అర్జునుడు పలికెను— ఓ కేశవా ! సమాధిస్థితుడై పరమాత్మప్రాప్తినొందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములేవి ? అతడు ఎట్లు భాషించును ? ఎట్లు కూర్చొనును ? ఎట్లు నడుచును ?

55 వ శ్లోకం:–

శ్రీభగవానువాచ |

ప్రజహాతి యదా కామాన్సర్వాన్పార్థ మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రఙ్ఞస్తదోచ్యతే || |

భావం:–
శ్రీ భగవానుడు పలికెను—-ఓ అర్జునా ! మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వారా, ఆత్మయందు సంతుస్టుడైనవానిని, అనగా పరమాత్మ సంయోగమువలన ఆత్మఆనందమును పొందినవానిని స్థితప్రజ్ఞుడని యందురు.

.56 వ శ్లోకం:-

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ||

భావం:–
దుఃఖములకు కుంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని, క్రోధములను వీడినవాడును ఐనట్టి మనశీలుడు (ముని) స్థితప్రజ్ఞుడనబడును.

57 వ శ్లోకం:–

యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ||

భావం:–
దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితులయందు హర్షము. ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును.

58 వ శ్లోకం:–

యదా సంహరతే చాయం కూర్మో‌உంగానీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ||

భావం:–
తాబేలు తన అంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా, ఇంద్రియముల (విషయాదుల) నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావించవలెను.

59 వ శ్లోకం:–

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసో‌உప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||

భావం:–
ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వానినుండి, ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును. కాని వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కరమైనందు వలన వాని నుండి ఆ ఆసక్తిగూడ తొలగిపోవును.

60 వ శ్లోకం:–

యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ||

భావం:–
ఓ అర్జునా ! ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగి పోనంతవరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థములవైపు బలవంతముగా లాగుకొనిపోవుచునే యుండును.

.61 వ శ్లోకం:-

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ||

భావం:–
ఎప్పుడూ కూడా సాధకుడు తన ఇంద్రియములను అన్నిటిని వశము నందుంచుకొని, సమాహితచిత్తుడై (చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసినవాడై) మత్పరాయణుడై , ధ్యానము నందు కుర్చొనవలెను. ఏలనన, ఇంద్రియములను వశమునందుంచుకొనువాని బుద్ధి స్థిరముగా నుండును.

62 వ శ్లోకం:–

ధ్యాయతో విషయాన్పుంసః సంగస్తేషూపజాయతే |
సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధో‌உభిజాయతే ||

భావం:–
విషయచింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును.

63 వ శ్లోకం:–

క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్స్మృతివిభ్రమః |
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి ||

భావం:–
అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞాపకశక్తి నశించును. బుద్ధి నాశనమువలన మనుష్యుడు తన స్థితినుండి పతనమగును.

64 వ శ్లోకం:–

రాగద్వేషవిముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ||

భావం:–
అంతఃకరణమును వసమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనః శాంతిని పొందును.

65 వ శ్లోకం:–

ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ||

భావం:–
మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నియు నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్నివిషయములనుండి వైదొలగి, పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును.

66 వ శ్లోకం:–
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖమ్ ||

భావం:–
ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆసక్తిభావమే కలుగదు. తత్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. మనః శాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును ?

67 వ శ్లోకం:–

ఇంద్రియాణాం హి చరతాం యన్మనో‌உనువిధీయతే |
తదస్య హరతి ప్రఙ్ఞాం వాయుర్నావమివాంభసి ||

భావం:–
నీటిపై తేలుచున్న నావను గాలినెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను, ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును.

68 వ శ్లోకం:–

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ||

భావం:–
కనుక ఓ అర్జునా ! ఇంద్రియములను ఇంద్రి యార్థముల నుండి అన్ని విధములుగ పూర్తిగా నిగ్రహించిన పురుషునియొక్క బుద్ధి స్థిరముగా నుండును.

69 వ శ్లోకం:–

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ||

భావం:–
నిత్యజ్ఞానస్వరూపపరమానందప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని యుండును. అది ఇతర ప్రాణులన్నింటికిని రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నియు మేల్కొని యుండును. అది పరమాత్మతత్వమునెరిగిన మునికి (మనశీలునకు) రాత్రితో సమానము.

70 వ శ్లోకం:–

ఆపూర్యమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ |
తద్వత్కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ ll

భావం:–
సమస్తదిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదులన్నియును, పరిపూర్ణమై నిశ్చలముగా నున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగనే అందులో లీనమగును. అట్లే సమస్తభోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు.

71 వ శ్లోకం :–

విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః |
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ||

భావం:–
కోరికలన్నిటిని త్యజించి, మమతా- అహంకార, స్పృహా రహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును.

72 వ శ్లోకం:–

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాస్యామంతకాలే‌உపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ||

భావం:–ఓ అర్జునా ! బ్రాహ్మీస్థితి యనగా ఇదియే. (ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి) ఈ బ్రహ్మీస్థితిని పొందిన యోగి ఎన్నడును మొహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రహ్మీస్థితి యందు స్థిరముగా నున్నవాడు బ్రహ్మానందమును పొందును.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే…

సాంఖ్యయోగో నామ ద్వితీయో‌உధ్యాయః ||

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s